Wednesday, February 5, 2014

I have been to a camp on Logic, Language, Life Skills conducted by Vandemataram Foundation at SPR school, Ghatkesar. I wish to share my experiences with you.




"చక్రవర్తి అశోకుడెచ్చట, జగద్గురు శంకరుండెచ్చట
ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు.."

అని గతించిన కాలాన్ని గురించి పాడుకుంటూ SPR స్కూల్ కి నా ప్రయాణం ప్రారంభించాను.మంచు ముసుగు లో కూడా ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, ఉద్యోగానికి వెళుతున్న పిల్లలకి "సద్ది" కట్టిస్తున్న తల్లులు, కిట కిట లాడుతున్న దేవాలయాలు - శతాబ్దాలు దాటినా విచ్చిన్నం  కాని ఈ దేశ సాంస్క్రుతిక బలాన్ని తలుచుకుంటూ ఒక నూతన అనుభవం వైపు నడిచాను.

స్కూల్ ని చూడగానే విద్యార్థుల సృజనాత్మకత ని, తల్లి తండ్రుల కష్టాన్ని తాగేసే మరో కార్పొరేట్ రాక్షసి లాగానే అనిపించింది.విద్యార్థులకు  క్యాంప్ నిర్వహిస్తున్నారంటే నాకు తెలిసిన "concentration camp" స్మరనకు వచ్చింది.పిల్లల్లో క్రమశిక్షణ కోసం వారిని క్రమంగా శిక్షించే పని లో ఉన్న PET సార్ ని చూసేందుకు సిద్దమయ్యాను.

పండగ రోజున వినిపించే డప్పు శబ్దం తరగతి గది కి దారి చూపించడం చూసి మొదట కొంత ఆశ్చర్య పోయాను.తొంగి చూస్తే  40 - 45 సం. వయస్సు గల వ్యక్తి ఐదుగురు పిల్లలతో కలిసి dance చేస్తున్నాడు.తరువాత తెలిసింది ఎక్కాలు లేని లెక్కల పరీక్షలో ప్రథమ  స్థానం లో నిలిచిన విద్యార్థుల తో SPR విద్యాసంస్థల ఛైర్మన్ కలిసి ఆడుతున్నారని!!చదువుల పండగ నిర్వచనం లాగా ఉంది ఆ సన్నివేశం. రెండు నిమిషాల లోనె అంతా నిశ్శబ్దం. ధ్యానం,గాయత్రి మంత్రం జపిస్తూ పిల్లలు మరో పరీక్షకు సిద్ధమయ్యారు.విచిత్రంగా ఒక్క కర్ర విరగ లేదు, ఒక్క పరుష వాక్యం దొర్లలేదు.

విఠల్ ( 5వ తరగతి, తాండ్ర ) తో లెక్కల పరీక్షలో పోటీ  పడదామని ప్రయత్నించాను.కాని నేను అలొచించే లోపే ఆ చిట్టి తమ్ముడు సమాధానలు  రాసెయ్యడం చూసి నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.ఇంతలో దాస్ మిగతా వాలంటీర్ల తో కలిపించాడు.వేల జీతాలు తీసుకునె టీచర్ లలో కూడా కనిపించని అంకిత భావం, పిల్లల పట్ల వారి ప్రేమాభిమానం నన్ను ముగ్ధున్ని చేసింది.

ఉద్యోగాన్నే ఇంటి పేరు గా మార్చుకున్న "J.D" లక్ష్మి నారయణ గారు రావడం తో  ఒక్క సారిగా సందడి ప్రారంభం అయ్యింది.ఇక్కడ నించి అందరం "బాలసభ" కు వెళ్ళాము.

లోక్ సభ చూసాము, శాసన సభ చూసాము ఈ బాల సభ ఏంటో అని అడుగుతున్న నా స్నేహితుడు రాజు అవాక్కయ్యే లాగ షెహనాజ్ అనే 6వ తరగతి విద్యార్థిని బాల సభని ప్రారంభించింది.ఈ బాల సభ కి కర్త, కర్మ, క్రియ అంతా విద్యార్థులే.ముఖ్య అతిథు లు కూడా వారే!ఊరు కాని ఊరు అయినా లేశం మాత్ర మైనా భయం లేకుండా ఉపన్యసిస్తున్న ఈ పిల్లల ఆత్మస్థైర్యం మమ్మల్నందిరినీ సమ్మో హితులని చేసింది.ఇవ్వాల్టి బాల సభే రేపటి గ్రామ సభ, శాసన సభ, లోక్ సభ అని చెప్పిన ఒక చెల్లి వాక్యం ముమ్మాటికి అక్షర సత్యం.

ఖలీల్ సార్ గారు తన పాట లో భారత దేశాన్ని చూపించేసారు.చివరన J.D గారి ఉపన్యాసం తో కార్యక్రమం ముగిసింది. 

ప్రతి సంవత్సరం ASER విశ్లేషణల తో కృంగిపొయే మాలో ఈ అనుభవం కొత్త ఆశలను రేకెత్తించింది.సర్కారు బడి పిల్లల్లో ని సత్తాని వెలికి తీసి ఈ జాతి నిర్మాణానికి యోగదానం చేస్తున్న వందేమాతరం వారికి మనస్పూర్తిగా మా అభినందనలు.
 
"
మాది సర్కారు బడి
అది సంస్కారానికి జలనిధి

మాకు లేవు 
    నిండిన కడుపులు
    పొడుగు లాగులు
    పుస్తకాల మోతలు 
    సెల్లు ఫోనులు
    ఫేసు బుక్కులు
    ప్రేమ కలాపాలు

మాకున్నవి
    వాల్మికి వారసత్వం
    ఏక లవ్యుని ఆదర్శం 
    జాతి అంటే గర్వం
    తోడు నిలిచే వందేమాతరం
    చదువు పట్ల అంకిత భావం
    
మా నేస్తాలు 
    మట్టి, మనిషి, ప్రకృతి 

మా దారులు 
    వివేకానందుని సూక్తులు

ఓ విశ్వమా! కళ్లు తెరచి చూడు.తూర్పున కమ్మిన తిమిర తెరలను చీల్చుకుంటూ విశ్వవేదిక పై జ్ఞాన వీణ ను వినిపించేందుకు తరలి వస్తున్న మమ్మల్ని"

No comments: